Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెచ్1బీ వీసా అలర్ట్.. ఈ కారణంతో కూడా మీకు నో చెప్పవచ్చు!

H1B Visa Alert Application Rejection Due to Signature Issues
Advertisement
  • హెచ్-1బి, గ్రీన్ కార్డు దరఖాస్తులపై అమెరికా కొత్త నిబంధనలు
  • సంతకం సరైంది కాకపోతే అప్లికేషన్ తిరస్కరణకు అవకాశం
  • దరఖాస్తు తిరస్కరించినా ఫైలింగ్ ఫీజు తిరిగి ఇవ్వరు
  • జూలై 10 నుంచి అమల్లోకి రానున్న తాత్కాలిక తుది నియమం
Advertisement
అమెరికాలో హెచ్-1బి వీసా, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి అక్కడి ఇమ్మిగ్రేషన్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ ఫారమ్‌లపై సరైన సంతకం లేకపోతే, దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం ఉందని, పైగా ఫైలింగ్ కోసం చెల్లించిన ఫీజును కూడా తిరిగి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) కొత్త నిబంధనలను ప్రకటించింది.

అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్ఎస్) ప్రకారం, నకిలీ సంతకాలతో దాఖలవుతున్న దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కఠిన నిబంధనను తీసుకొచ్చారు. ఈ తాత్కాలిక అంతిమ నియమం (ఇంటెరిమ్ ఫైనల్ రూల్) ఈ ఏడాది జూలై 10 నుంచి అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానం ప్రకారం, ఒకసారి దరఖాస్తును స్వీకరించిన తర్వాత కూడా, పరిశీలన దశలో సంతకం చెల్లదని తేలితే దానిని తిరస్కరించే అధికారం యూఎస్ సీఐఎస్ కు ఉంటుంది.

ఈ విధంగా తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు ఫైలింగ్ ఫీజు కింద చెల్లించిన వేలాది డాలర్లు నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే, సంతకం కారణంగా తిరస్కరించినా ఆ కేసును పూర్తిగా పరిశీలించినట్టుగానే పరిగణిస్తామని యూఎస్ సీఐఎస్ పేర్కొంది. ఇది దరఖాస్తుదారుల ఇమ్మిగ్రేషన్ స్టేటస్, వర్క్ పర్మిట్, ప్రయారిటీ డేట్స్ వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఏ సంతకాలు చెల్లవంటే..! 
చేతిరాతతో చేసిన అసలైన సంతకాలు (వెట్-ఇంక్) ప్రామాణికంగా ఉంటాయి. వాటిని స్కాన్ చేసినా, ఫ్యాక్స్ చేసినా లేదా ఫోటోకాపీ తీసినా సాధారణంగా అంగీకరిస్తారు. అయితే కాపీ-పేస్ట్ చేసిన సంతకాలు, డిజిటల్‌గా రూపొందించినవి, సంతకం స్టాంపులు, పదేపదే వాడిన సంతకం ఇమేజ్‌లను చెల్లనివిగా పరిగణిస్తారు. కేవలం యూఎస్ సీఐఎస్ అధికారిక ఆన్‌లైన్ ఫైలింగ్ పోర్టళ్లలో మాత్రమే ఎలక్ట్రానిక్ సంతకాలు చెల్లుబాటు అవుతాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు, యజమానులు ఫైలింగ్ ప్రక్రియలో మరింత జాగ్రత్త వహించడం తప్పనిసరి.
Advertisement
Advertisement
H1B Visa
USCIS
H-1B Visa
Green Card
US Immigration
Immigration Form
USCIS Rule
Immigration Status
Work Permit
Priority Dates

More Telugu News